జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామస్థులు ఏడాదికోసారి జరుపుకునే మల్లన్న స్వామి జాతర వైభవంగా జరిగింది. 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా బోనాలతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు.
శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆట పాటలతో వేడుకలు శోభాయమానంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. రోజంతా ఉపవాస దీక్షలు ఉండి భక్తిశ్రద్ధలతో స్వామివారికి బోనాలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామివారి రథాన్ని ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి.. వేడుకలను ముగించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
స్థలపురాణం
గర్భగుడిలో గుర్రంపైన కూర్చుని భక్తులకు దర్శనమిచ్చే మల్లన్నస్వామి వందేళ్లక్రితం ఈ ఊళ్లో రాయి రూపంలో వెలిశాడని అంటారు. అయితే... మొదట్లో ఈ ఊళ్లోని యాదవులు మాత్రమే స్వామిని పూజించేవారనీ, కొన్నాళ్లకు ఊరివాళ్లంతా తమ ఇలవేల్పుగా కొలవడం ప్రారంభించారనీ చెబుతారు స్థానికులు. మొదట తాటికమ్మలతో వేసిన చిన్న గుడిసెలోనే ఈ ఆలయం ఉండేదనీ క్రమంగా ఇక్కడకు వచ్చే భక్తులు గర్భగుడిని నిర్మించారనీ అంటారు. సంతానం, పెళ్లి, వ్యాపారం, ఇల్లు.. ఇలా ఏది కోరుకుని స్వామికి మొక్కుకున్నా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. అలా తమ కోరికలు తీరినప్పుడల్లా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నా.. ఏడాదికోసారి ఇలా జాతర నిర్వహిస్తారు.
ఎలా చేరుకోవచ్చంటే..
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి పెద్దాపూర్ గ్రామం 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగిత్యాల వరకూ చేరుకుంటే... అక్కడినుంచి జాతరకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులతో పాటు ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇదీ చూడండి: మల్లన్న జాతరకు.. యాభైవేల బోనాలు!