ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో సమస్యలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఆలయంలో మౌళిక వసతుల కల్పన నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 66 మంది మృతి చెందటంతో కొండపైకి నాలుగు వరసల రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ప్రాంతాలను కలుపుతూ పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా... అవి హామీలుగానే మిగిలిపోయాయి.
భక్తులకు బస చేసేందుకు గదులు లేవు
అంజనేయ స్వామి భక్తుల మాల విరమణ కోసం రెండున్నర కోట్లతో రూపాయలతో చేపట్టిన భవనం పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆలయానికి వచ్చే భక్తులకు బస చేసేందుకు గదులు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోప్‌వే ఏర్పాటుకు ప్రణాళికలు తప్ప ఆచరణలో ముందడుగు పడలేదు. ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉన్నా సదుపాయాలు కల్పించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు.