రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రాల తర్వాత అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది కొండగట్టు అంజన్న క్షేత్రం. దేవాలయానికి ప్రతి మంగళ, శనివారాల్లో 20 వేల నుంచి యాభైవేల మంది వరకు భక్తులు దర్శనానికి తరలివస్తారు. ఇక చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు నుంచి నాలుగు లక్షల మంది దీక్షాపరులు ఆలయంలో మాల విరమణ చేస్తారు. ఇంత పెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న అంజన్న ఆలయం మాత్రం... అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది.
రోజూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు స్నానం చేసేందుకు కోనేరులో నీళ్లు ఉండటం లేదు.. ఎవరైనా ముఖ్యనాయకులు, అధికారులు వచ్చినప్పుడే నీళ్లు నింపి ఆ తర్వాత రోజుల్లో అసలు పట్టించుకోవటంలేదనే ఆరోపణలున్నాయి. భక్తులు బస చేసేందుకు కూడా గదులు సరిపోవడంలేదు. మరుగుదొడ్ల పరిస్థితి అంతంతమాత్రమే ఉండగా... పారిశుద్ధ్యం గురించి అసలే పట్టించుకునే నాథుడే లేడు.