ప్రైవేటు బడి వద్దు.. సర్కారు బడే ముద్దు Government School At Tombarrao Peta In Jagityala : ఆ గ్రామంలోని చిన్నారులకు.. ప్రైవేట్ పాఠశాల అంటే తెలియదు. ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్‌కు ధీటుగా మంచి విద్య లభించటంతో.. ఊరంతా సర్కారు బడిలోనే తమ పిల్లలను చదివిస్తున్నారు. గ్రామస్థుల సహకారం.. ఉపాధ్యాయుల కృషితో.. ఆ పాఠశాల ఆదర్శ పాఠశాలగా నిలుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఆ పాఠశాలనే జగిత్యాల జిల్లాలో ఉన్న తొంబర్రావు పేట ప్రభుత్వం పాఠశాల.
ఈ సర్కారు వారి బడిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల బోధన సాగుతోంది. 2014లో 11 మంది విద్యార్థులున్న పాఠశాలని.. ప్రభుత్వం మూసేయాలని నిర్ణయించింది. కానీ తమ ఊరి బడిని తామే కాపాడుకుంటామని.. గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చారు. అందులో భాగంగా తమ పిల్లలను ప్రయివేట్ స్కూళ్లకు పంపించకుండా.. గ్రామస్థులంతా తమ పిల్లలను అదే బడిలో చదివించాలని నిర్ణయం తీసుకున్నారు.
Minister KTR Praise For Govt School In Thombar Rao Peta : అందుకు ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ రావు కృషితో.. విద్యార్థులకు మంచి విద్య అందుతుండడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కేవలం 11 మందే విద్యార్థులు ఉన్న పాఠశాల.. ఇప్పుడు ఏకంగా 104 మంది విద్యార్థులతో వెలుగులీనుతోంది. 'మన ఊరు మనబడి' పథకం ద్వారా నిధులు కేటాయించగా.. మరుగుదొడ్లతో పాటు చక్కని ఆహ్లాదకరమైన వాతవరణాన్ని కల్పించారు.
"ఒకప్పుడు ఈ పాఠశాలలో ఏడుగురు మాత్రమే విద్యార్థులు ఉండేవారు. గ్రామస్థుల సహకారం, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు 108 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామస్థులంతా పిల్లలను ప్రయివేట్ పాఠశాలలకు పంపించవద్దని నియమాన్ని పెట్టుకొని.. అందరూ ప్రభుత్వం పాఠశాలకే పిల్లలను పంపిస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం మూసివేయాలనే ఆలోచనతో ఉండేది." - జీవన్‌రెడ్డి, విద్యాకమిటీ ఛైర్మన్
Telangana Govt Schools : పాఠశాలలో ఇద్దరు మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులుండగా.. మరికొందరు విద్యా వాలంటీర్లను నియమించారు. మరో ఉపాధ్యాయురాలు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. వారికి పాఠశాల ఖజానా నుంచే జీతాలను చెల్లిస్తున్నారు. అలాగే పాఠశాలలో నెలకొన్న.. ఉపాధ్యాయుల కొరతపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్థులు కోరుకుంటున్నారు.
పాఠశాల అభివృద్ధిపై కేటీఆర్ ప్రశంసలు : ఇప్పుడు ఆ పాఠశాల చక్కని బోధన సాగిస్తున్నందుకుగానూ.. మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక దీనిపై ఈనాడులో వచ్చిన ప్రత్యేక కథనానికి.. మంత్రి కేటీఆర్ సైతం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దీనిపై గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో గర్వంగా భావిస్తూ.. ఇంకా మెరుగైన స్థితికి తమ బడిని తీసుకువెళతామన్నారు. విద్యార్థులు సైతం ముద్దుముద్దుగా ఆంగ్లంలో మాట్లాడుతూ.. ఎక్కడా ప్రైవేటు పాఠశాలలకు తీసిపోకుండా ఆకట్టుకుంటున్నారు. బడికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని.. గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి :