తెలంగాణ

telangana

ETV Bharat / state

ktr tweet on paper boy video : పేపర్ బాయ్ కాన్ఫిడెన్స్​కు మంత్రి కేటీఆర్ ఫిదా! - ktr is mesmerized by paper boy answer

రెండేళ్ల నుంచి బడులు బంద్​. ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. ఈ సమయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలవాలనుకున్నాడు పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని ఆ బాలుడు. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు పేపర్​ వేస్తున్నాడు. తన పాకెట్ మనీ తానే సంపాదించుకుంటూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ బాలుడు పేపర్ వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మంత్రి కేటీఆర్.. రిపోర్టర్ ప్రశ్నకు ఆ చిన్నారి ఇచ్చిన సమాధానానికి ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ బుడ్డోడు ఏం చెప్పాడంటే..

ktr tweet on paper boy video
ktr tweet on paper boy video

By

Published : Sep 23, 2021, 2:13 PM IST

ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఉదయం పేపరు వేస్తూ ఇంటి ఖర్చులకు సంపాదించుకుంటున్న ఓ విద్యార్థి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీన్ని వీక్షించిన కేటీఆర్ ఆ విద్యార్థి కాన్ఫిడెన్స్​కు కేటీఆర్ సెల్యూట్ చేశారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆ బాలుడు ఇచ్చిన సమాధానాలు చూసి మంత్రి ఫిదా అయ్యారు. జగిత్యాల నుంచి వచ్చిన ఈ వీడియోలో... బాలుడి ఆత్మవిశ్వాసం చూసి మంత్రి కేటీఆర్.. చాల సంతోషపడ్డానన్నారు. చదువుకుంటూ పని చేయటంలో తప్పేంటన్న అతని సమాధానం.. భవిష్యత్‌లో మంచి స్థితిలో ఉంటాడని ట్విటర్‌లో ఆకాక్షించారు.

జగిత్యాలలో ఓ విద్యార్థి ఉదయాన్నే సైకిల్​పై వెళ్తూ న్యూస్ పేపర్లు వేస్తుండగా.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూశారు. బాలుడితో కాసేపు మాట్లాడారు. ఏ పాఠశాలలో చదువుతున్నాడో అడిగారు. చదువుకునే వయసులో పేపర్ వేస్తున్నావు.. పాఠశాలకు వెళ్లట్లేదా అని అడిగిన ప్రశ్నకు.. ఏ.. చదువుకుంటూ పేపర్ వేయకూడదా? అని చాలా ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చాడు. ఆడుకునే వయసులో అంత కష్టపడుతున్నావెందుకు అని అడిగితే.. ఇప్పుడు కష్టపడితేనే పెద్దైన తర్వాత అలవాటవుతుందని చెప్పాడు.

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ బుడ్డోడి కాన్ఫిడెన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలా కష్టపడి చదువుకునే వారిని ప్రభుత్వం చేరదీసి ప్రోత్సహించాలని.. వారికి అండగా నిలిస్తే వారి భవిష్యత్ అద్భుతంగా తీర్చిదిద్దుకోగలరని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. చదువుకుంటూ పని చేయడం తప్పు కాదని.. అలా చిన్నతనం నుంచే పని చేయడం అలవాటైతే.. స్వతంత్రంగా బతకం సులభమవుతుందని మరికొందరు కమెంట్ చేశారు. మరోవైపు ఈ బుడ్డోడి సమాధానాలకు, తెగువకు ఫిదా అయిన మీమర్స్ తెగ మీమ్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. సోషల్ మీడియాలో ఈ రోజంతా ఈ బుడ్డోడిదే హవా.

ABOUT THE AUTHOR

...view details