KTR fires on Revanth Reddy : మంత్రి కేటీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ తండ్రి సంతాప సభకు హాజరై నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ నివాసంలో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాచరణను కేటీఆర్ వివరించారు. రేపటి నుంచి 10 రోజుల పాటు రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశాల్లో మూడు పంటలు కావాలో.. మూడు గంటల కరెంట్ కావాలో రైతులు తీర్మానం చేస్తారన్నారు.
ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్ విధానమా? అని మంత్రి ప్రశ్నించారు. ఐదు దశాబ్దాల పాటు రైతులను అధోగతి పాలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. దీనిపై ప్రజలే తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.
KTR fires on Rahul Gandhi : 'కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎడ్లు తెలవదు, వడ్లు తెలవదు.. రాహుల్ గాంధీకి క్లబ్బులు, పబ్బులు మాత్రమే తెలుసు' అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని.. ఆయన ఏనాడైనా మోదీని ప్రశ్నించడం చూశామా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులను ఆ పార్టీ రాబందుల్లా పీక్కుతిందని మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయ విధానాన్ని పక్క రాష్ట్రాలు సైతం మెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు.