Kondagattu Anjanna Temple masterplan: ప్రసిద్ది చెందిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మాస్టర్ ప్లాన్‌ను 75రోజుల్లో సిద్ధం చేయాలని సంకల్పించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ దేవాలయానికి చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అందుకు సరిపడా వసతులు.. సౌకర్యాలు లేవు. రహదారి మార్గాలు కూడా సరిగ్గా లేవు. ఈ దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తూ.. ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా రూ.500 నుంచి రూ.600కోట్లు అయినా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.
Kondagattu Anjanna Temple development masterplan : ప్రభుత్వ ఉత్తర్వులతో గుట్ట అభివృద్ధికి పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి అధికారులు నిర్ణయించనున్నారు. ఆలయం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతానికి నష్టం కలగకుండా ప్రధాన ఆలయ విస్తరణ, కల్యాణ మండపం, వివిధ ఆలయాల నిర్మాణాలకు ప్రణాళికలు రచించనున్నారు.
ఎస్సారెస్పీ నుంచి నీటి మళ్లింపు:భవిష్యత్తులో కొండగట్టుకు నీటి ఎద్దడి రాకుండా ఎస్సారెస్పీ కాల్వ నుంచి పైపులైన్ ద్వారా నీటిని తరలించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఆలయ విస్తరణ తర్వాత పెరిగే భక్తులను దృష్టిలో ఉంచుకొని.. లిఫ్టు ద్వారా నీటిని గుట్టపైకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ లైన్‌కు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.