కొండగట్టు అంజన్న చెంత.. అసౌకర్యాల తిష్ట మనసు ప్రశాంతత కోసమో.. బాధల నుంచి రక్షించమంటూ.. భక్తితో దైవదర్శనం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాం. కానీ ఆలయం వద్ద కనీస వసతులు లేకపోతే అసంతృప్తిగానే తిరిగి రావాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మంగళ, శనివారాల్లో వేలల్లో అంజన్న సన్నిధికి వస్తుంటారు. హనుమాన్ జయంతి సమయంలో మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారు. ఏటా రూ.17 కోట్లు ఆదాయం వస్తున్నా ఆలయం వద్ద కనీస వసతులు కరవయ్యాయి. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ హామీలు అమలులో కానరావడం లేదు.
నీళ్లు లేవు... గదులు లేవు
బస్సు ప్రమాదం జరిగినపుడు ఘాట్‌రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మారుస్తామని, మాస్టర్ ప్లాన్ అమలు చేసి పర్యటక కేంద్రంగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే మరిచిపోయింది. మెట్లదారి నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన తాగునీటి వసతి, మరుగుదొడ్లు సరిపోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోనేటిలో మునగాలంటే భయం వేస్తోంది
నూతన కోనేరు నిర్మించినా అది ఉపయోగించడం లేదు. పవిత్రత కోసం కోనేరులో స్నానం చేస్తే భక్తి మాట అటుంచి.. రోగాలు వస్తాయేమోనని భయపడే పరిస్థితి. కార్యాలయ భవనం నిర్మించినా ప్రారంభానికి నోచుకోక వృథాగా ఉంది. కల్యాణకట్ట భవన నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉంది. పవిత్ర మాసాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కనీసం వెయ్యి వసతి గదులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
మాస్టర్‌ప్లాన్ అమలుచేసి, నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు చేస్తే భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. పర్యటక కేంద్రంగా తయారు చేస్తే ప్రకృతి సోయగాల్లో సేదదీరే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: బాధితులకు ఇంకా అందని పరిహారం.. మానని గాయం