KCR Praja Ashirvada Sabha at Jagtial :తెలంగాణ ప్రగతికి పదేళ్లు కావొస్తోందని.. ఈ దశాబ్ద కాలంలో భారత రాష్ట్ర సమితి(BRS Party) అందించిన సంక్షేమాలను చూసి ప్రజలు ఓటు వేయాలనిసీఎం కేసీఆర్ సూచించారు. జగిత్యాలలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించిన కేసీఆర్.. తాను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమేనని.. తనకు పదవులు లెక్క కాదన్నారు. తెలంగాణ సాధించానన్న పేరే తనకు గొప్ప పదవిగా అభివర్ణించారు.
Telangana Assembly Election 2023 :స్థానిక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ(Indira Gandhi) రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని పునరుద్ఘాటించారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. నాడు ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టింది అని కేసీఆర్ విమర్శించారు.
జాగ్రత్తగా ఓటు వేయకుంటే చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది : కేసీఆర్
అటువంటి పరిస్థితులు మళ్లీ రాష్ట్రానికి కావాలని ప్రశ్నించారు. సంపద పెరిగే కొద్దీ ప్రజలకు పంచుతున్నామన్న సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ ముందే ఉందని పేర్కొన్నారు. అందుకోసం ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్(Congress Party) హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం రద్దు చేశామని తెలిపారు. దేశంలో నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.
తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉన్నదా? అయినా ప్రజలు మన్నించి ఇచ్చారు.. అందుకే నేను రెండు సార్లు ముఖ్యమంత్రి అయి పదేళ్లు పూర్తవుతుంది. నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రులు కూడా ఎవరు లేరు. ఈ కీర్తి నాకు చాలు. నేను కొట్లాడేది ఇవాళ నా పదవి కోసం కాదు. కచ్చితంగా తెలంగాణ నూటికి నూరు శాతం పేదరికం లేని రాష్ట్రంగా అవతరించాలన్నది నా పంతం. -కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి