తెలంగాణ

telangana

ETV Bharat / state

Karimnagar Roads Damage 2023 : రహ'దారుణం'.. వాన మిగిల్చిన వ్యథ.. ఇదీ రహదారుల దీనగాథ - Floods in Karimnagar district

Roads Damage due to Karimnagar Rains 2023 : ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. జరిగిన నష్టం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లను పునరుద్ధరించినా.. ఇప్పటికీ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నీటిప్రవాహం పూర్తిగా తగ్గితేనే ఏ మేరకు నష్టం వాటిల్లిందనే అంశాన్ని అంచనా వేయగలమని అధికారులు చెబుతున్నారు.

Roads
Roads

By

Published : Jul 29, 2023, 9:45 AM IST

కుండపోత వానలతో నేటి పరిస్థితి.. ఇదీ రోడ్ల దుస్థితి

Karimnagar Roads Damage 2023 :ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాలకు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం అతలాకుతలమైంది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారీ వర్షాల మూలంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్, ప్రకాశంరోడ్, ఝాన్సీరోడ్, గంగంపేట్, రవీంద్రరోడ్డు పూర్తిగా జలమయం కాగా, మెట్​పల్లిలోని చైతన్యనగర్, శివాజీనగర్, దీన్‌దయాల్​నగర్, హనుమాన్​నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వరదనీరు రోడ్లపై ప్రవహించింది.

JagtialRoads Damage 2023 :ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్- మూలరాంపురం, వర్షకొండ శివారులోని ఎర్గట్ల వద్ద వాగు పొంగి పొరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల వంతెనలు తెగిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులు వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడిక్కడ రహదారులు దెబ్బతినటంతో నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

Roads damaged in karimnagar 2023 :కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు మండలాల్లోని గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపూర్ చెరువుకు మంగపేట వద్ద గండిపడి గంగాధర, నారాయణపూర్, ఇస్తారుపల్లేలు జలమయంగా మారాయి. దీంతో మూడు గ్రామాల ప్రజలు వరదముంపుతో భయం భయంగా కాలం గడిపారు. రామడుగు మండలంలోని మోతె వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో.. పది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

రామడుగు వంతెన పాక్షికంగా ధ్వంసం కాగా.. రుద్రారం వంతెన వద్ద అరకిలోమీటర్ మేర రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. హుజూరాబాద్ మండలంలోని హుజురాబాద్- జూపాక ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు సగం వరకు కొట్టుకపోయింది. ప్రధాన రహదారి సుమారు 200 మీటర్ల మేరకు కోతకు గురైంది. వీణవంక- నర్సింగాపూర్ గ్రామాల మధ్య రహదారి దెబ్బతింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాను వరద ముంచేసింది. ఇందుకు ప్రధాన కారణం కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనాల శివారులోని కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పు ఉంటే.. అక్రమార్కులు పూడ్చివేయడంతో.. వెంకంపేట, ధోబీఘాట్‌కు చేరేసరికి 10మీటర్లకు తగ్గిపోయింది. ఇందులో నుంచి వచ్చిన వర్షపు నీరు ఎక్కువశాతం రోడ్లపైనే ప్రవహించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

Rajanna siricilla district Floods : రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ స్వయంగా ట్రాక్టర్‌పై పర్యటిస్తూ.. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడమే కాకుండా వారికి ధైర్యం చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బొక్కల వాగు ఉద్ధృతిని.. ప్రభుత్వ అధికారులతో కలిసి మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు పరిశీలించారు. ఎక్లాస్‌పూర్, ఖానాపూర్, చిన్నఓదెల, పెద్ద ఓదెల, గోపాల్‌పూర్‌ గ్రామాలను సందర్శించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి మానేరులో ముంపుకు గురైన పొలాలను పరిశీలించారు.

"గోదావరి, మానేరు, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలి. ముంపు ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం స్వల్పకాలిక ప్రణాళికలు కాకుండా దీర్ఘకాలిక రూపొందించాలి". - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంథని ఎమ్మెల్యే

హుస్నాబాద్ నియోజకవర్గంలోని దాదాపు 600కు పైగా చెరువులు, కుంటలు నిండుకుండలా మారి మత్తడి పారుతున్నాయని ఎమ్మెల్యే సతీశ్​కుమార్ అన్నారు. భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం పట్ల వారిని అభినందించారు. గోదావరి, మానేరు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రమాదాన్ని అంచనా వేసి.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details