పొట్టకూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి.. పనిదొరకక యాచిస్తూ కాలం గడుపుతున్న ఓ తెలంగాణ వ్యక్తి ఏకంగా 21 ఏళ్లకు ఇంటికి చేరాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మరిపేటకు చెందిన వొల్లం గంగరాజం.. సుమారు 22 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించక.. పనిదొరకలేదు. పని కోసం వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో.. తెలియకుండానే దుబాయిలోకి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడికి చేరిన కొన్ని రోజులు ఎలాగోలా తన జీవనాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత పరిస్థితి చేయిదాటిపోయింది. ఎక్కడ పని కోసం వెతికినా వీసా, సంబంధిత పత్రాలు అడిగారు. అవి కాస్తా తన దగ్గర లేకపోవటంతో.. కంటి ముందు కనిపించిన పని చేతికందకపోవటంతో.. బతుకు రోజురోజుకు గగనంగా మారింది.
దీన స్థితిలో మస్కట్ వీధుల్లో గంగరాజం అప్పటి నుంచి పని లేక.. తినటానికి తిండి లేక.. ఉండటానికి వసతి లేక.. ఇంటికి తిరిగి వెళ్దామంటే పాస్పోర్ట్ లేక నానా అవస్థులు పడుతూనే ఉన్నాడు. ఏకంగా 21 ఏళ్లుగా దుర్భర జీవితాన్ని ఈడుస్తున్నాడు. ఈడు ఉడిగి పోతున్న వయసులో నరకం అనుభవించాడు. చెట్టు కిందే జీవనం కొనసాగిస్తూ... అట్ట ముక్కలు, చిత్తు కాగితాలతోనే సావాసం చేశాడు. ఉన్న ఊరి ఊసు లేదు.. కన్నవారి ధ్యాస లేదు... ఎవరో దయతలిస్తే గానీ ఆ పూట కడుపు నిండని దుస్థితి.
గంగరాజంను కలిసిన గల్ఫ్ రక్షణ సమితి ప్రతినిధులు ఈ క్రమంలోనే.. గంగరాజం పరిస్థితి.. గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండల్లి నర్సింహా, ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ దృష్టికి వచ్చింది. వెంటనే.. గంగరాజం నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. అతడు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూసి.. దుబాయిలోని ఇండియన్ కౌన్సిలేట్ అధికారులకు, అక్కడి పొలీసు అధికారులకు విషయాన్ని తెలియజేసి.. గంగరాజంను స్వదేశానికి పంపించాలని కోరారు. స్పందించిన ఇండియన్ కౌన్సిలేట్ అధికారులు గంగరాజం స్వదేశానికి వెళ్లేందుకు అర్హత పత్రాలు, అవుట్ పాస్పోర్ట్ తయారు చేయాలని తెలిపింది. 11 నెలలు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు సంబంధిత పత్రాలను తయారు చేయించిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి.. చివరకు గంగరాజంను దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కలిగించారు. మొత్తానికి గంగరాజంను స్వదేశానికి పంపించారు.
21 ఏళ్లకు గంగరాజం ఇంటికి చేరుతుండటంతో అతని కుటుంబ సభ్యుల్లో పట్టరాని సంతోషం వ్యక్తమవుతోంది. తాను పుట్టిన కొన్ని రోజులకే విదేశానికి వెళ్లిన తండ్రిని.. 21 తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్టులో చూసి కూమారుడు ఉద్వోగానికి లోనయ్యాడు. గంగరాజం పరిస్థితి తెలుసుకుని ఇంటికి వచ్చేలా చొరవ తీసుకున్న నర్సింహా, శేఖర్గౌడ్కు.. అతడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: