Jagtial Rural SI Anil Controversy : ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళ మధ్య వచ్చిన గొడవ.. చినిచినికి గాలివానలా మారింది. బస్సీటు విషయంలో తన భార్యతో గొడవపడిందన కారణంతో.. యువతితో దురుసుగా ప్రవర్తించాడంటూ జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యకు నిరసనగా జగిత్యాల పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు జగిత్యాల బస్ డిపో ముందు బైఠాయించి.. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
మరోవైపు ఎస్సై వర్గానికి చెందిన గొల్లకుర్మ యాదవుల ఐక్యవేదిక జాతీయ అధికార ప్రతినిధి కొక్కు దేవేందర్ జగిత్యాల పట్టణంలో పర్యటించారు. ఆకారణంగా ఎస్సైపై చర్యలు తీసుకున్నారని.. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే ఆయన సస్పెన్షన్ ఆర్డర్‌ను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణ బంద్ సందర్భంగా.. పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
బంద్‌తో నాకు సంబంధం లేదు.. జగిత్యాల పట్టణ బంద్‌పై.. సస్పెన్షన్‌కు గురైన ఎస్సై అనిల్ స్పందించారు. తనకు, జగిత్యాల పట్టణబంద్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. కొందరు రాజకీయ పార్టీల వారు, కొన్ని వర్గాల వారు తమ స్వలాభం కోసం ఉద్దేశపూర్వకంగానే బంద్‌కు పిలుపునిచ్చాయని ఆరోపించారు. సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. చట్టంపై, పోలీస్ ఉన్నతాధికారులపై తనకు నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ వ్యవహారాన్ని డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం పరిష్కరించుకుంటానని తెలిపారు. తన పేరుతో బంద్ ప్రకటించి పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.