సామాజిక మాధ్యమాలే వేదికగా.. పేదలకు అండగా social service through facebook in jagtial: సామాజిక మాధ్యమాలను ఎక్కువ మంది కాలక్షేపానికే వాడుతుంటారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రేణికుంట రమేశ్ మాత్రం అవసరంలో ఉన్నవారికి అండగా ఉండేందుకు వినియోగిస్తున్నారు. కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న వారికోసం.. దేశ, విదేశాల్లో ఉన్న దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 25మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వివిధ రూపాల్లో దాదాపు కోటి 36 లక్షల రూపాయలు సాయం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పేదకుటుంబాలకు అండగా..జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆపదలో ఉన్నవారికి రేణికుంట రమేశ్ అండగా నిలుస్తున్నారు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో... ఆర్థికంగా కుంగిపోయిన వారికి, రోడ్డుప్రమాదాల వల్ల కష్టాల కడలిలో చిక్కుకున్న కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. సమస్యలతో కాలం నెట్టుకొస్తున్న వారి గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి... లోకానికి తెలియజేస్తున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న దాతలను సంప్రదించి... ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. రమేశ్ వల్ల తమకు ఉండటానికి ఇటింతోపాటు ఆర్థిక సాయం అందిందని బాధితులు చెబుతున్నారు. దాతల సాయం కోసం సామాజిక మాధ్యమాలను రమేష్ వేదికగా చేసుకున్నారు. ఇప్పటివరకు 111 నిరుపేద కుటుంబాలను ఆదుకున్నారు.
పాప వైద్యం కోసం తొలిసారిగా..2015 అక్టోబర్‌లో తొలిసారిగా ఒక పాప వైద్యం కోసం ఫేస్‌బుక్ ద్వారా నిధులను సేకరించడం మొదలు పెట్టారు రమేశ్. ఎంతో మంది ఎన్‌ఆర్‌ఐలు స్పందించారు. ఆ పాప వైద్యానికి 3 లక్షలు అవసరం కాగా ఏకంగా 9 లక్షల రూపాయలు సమకూరాయి. విద్య, వైద్యం సహా గూడు లేని వారికి ఇంటిని నిర్మించాలనే ధ్యేయంతో రమేశ్ ముందుకు సాగుతున్నారు. ఐదారేండ్లలో సుమారు కోటి 36లక్షల రూపాయల నిధులను సేకరించారు. సామాజిక మాధ్యమాలను కాలక్షేపం కోసం కాకుండా ఎదుటివారి కష్టాలు తీర్చడానికి ఉపయోగిస్తున్న రమేశ్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈయనను ఆదర్శంగా తీసుకొని మరికొంత మంది ముందుకు రావాలని కోరుకుందాం.
"దాతల సాయంతో ప్రతినెలా ఒక పేద కుటుంబాన్ని ఎంచుకుని ఫేస్‌బుక్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు, కర్ణాటకకు చెందిన బళ్లారి మిత్రులు , జగిత్యాలకు చెందిన సత్యసాయిబాబ ట్రస్టు సభ్యులు అందరూ కలిసి ప్రతి నెలా ఒక పేద కుటుంబానికి సాయం చేస్తున్నారు. దాతల ప్రోత్సాహంతోనే నిరుపేదలను ఎంపిక చేసి పేదలకున్న ఆర్థిక ఇబ్బందులతో పాటు.. ఇతర సమస్యలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తాం. ఆ పోస్టులు చూసి కొందరు దాతలు వారికి ఆర్థిక సాయం చేస్తూ.. వారి సమస్యలను పరిష్కరించడానికి మాకు సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 111 కుటుంబాలకు గాను ఒక కోటి 36లక్షలు దాతలు సాయం అందించారు. 111 కుటుంబాలలో 25 మంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించాం. ప్రతినెలా విద్య, వైద్యం, గృహనిర్మాణం కోసం తీవ్ర ఇబ్బందులున్న కుటుంబాలను ఎంపికచేసి ఈ 3 రంగాల్లో సంబంధించిన ఎవరికీ ఏ అవసరం ఉన్నా వారికి ఈ దాతల ద్వారా సాయం చేస్తున్నాం." - రేణికుంట రమేశ్, సామాజిక కార్యకర్త
ఇవీ చదవండి: