Jagtial Government School Students Acheivements : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థినులు క్రీడల్లో రాణిస్తున్నారు. పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు రాజేందర్ ప్రోత్సాహంతో ఇప్పటికే దాదాపు 30కు పైగా పతకాలను సాధించి బాలికలు రికార్డును సృష్టించారు. ఆదర్శ పాఠశాలలో తమ చదువు పూర్తి అయినా డిగ్రీ కరీంనగర్లో చదువుతూనే శిక్షణ మాత్రం మగ్గిడిలో 4 నుంచి 5 గంటల పాటు కసరత్తు చేస్తూ తమకున్న ఆసక్తిని చాటుకుంటున్నారు.
Jagtial Government School Students Won Gold Medals : వాస్తవానికి వెయిట్ లిఫ్టింగ్‌పై బాలికలు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ మగ్గిడి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. శిక్షణ పొందడం ఎంతో ఇబ్బందికరమైనప్పటికి క్రీడల్లో రాణించి దేశానికి, తమ గ్రామానికి పేరు తీసుకు రావాలన్నదే తమ లక్ష్యంగా చెబుతున్నారు. అయితే తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న దృష్ట్యా శిక్షణ సామగ్రితో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. దీనికి తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
"ఇప్పటి వరకు నేను 25 మెడల్స్ సాధించాను. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాను. లిఫ్టింగ్ అన్నది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్క కాస్ట్యూమ్ కొనాలి అంటే దాదాపుగా రూ.25 వేలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు నేను పోటీలో పాల్గొనడానికి దాదాపుగా రూ.లక్ష ఖర్చు అవుతాయి. డైట్ , ప్రాక్టీస్, ప్రోటీన్ ఇలా చాలా ఉంటాయి. మేము ఆర్థికంగా చాలా వెనుకపడి ఉన్నాం. ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నా." - విరంచి స్వప్నిక, ఏషియన్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని