లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగునీటి కోసం ఏర్పాటుచేసుకున్న మోటర్, పైపులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో జరిగింది. గత రాత్రి తమ పొలాల్లోని మోటార్లు, పైపులు, విద్యుత్ పరికరాలు కొన్నింటిని ధ్వంసం చేశారని.. మరికొన్నింటిని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదుచేశారు.
గడిచిన సంవత్సర కాలంగా తమ గ్రామంలో 90 వరకు కరెంటు మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. మోటార్లు ధ్వంసం చేయడం వల్ల.. పంట పొలాలకు సాగునీరందించడం ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. ధ్వంసమైన మోటార్లను పరిశీలించారు. ఎత్తుకెళ్లిన మోటార్ల వివరాలను సేకరించారు.