Paddy Cultivation in Jagtial: జగిత్యాల జిల్లా వరిసాగుకు పెట్టింది పేరు. జిల్లాకు వరదాయనిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండటం.. ఈసారి భారీ వర్షాలు కురవటంతో భూగర్భ జలాలుపైనే ఉండటంతో వరి సాగుకే కర్షకులు మొగ్గు చూపారు. జిల్లాలో మొత్తం 4 లక్షల 20 వేల ఎకరాల సాగు భూమి ఉండగా... అందులో రెండున్నర లక్షల ఎకరాల్లో ఏటా వరి సాగవుతోంది. అయితే ఈసారి వరి తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని.. వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పించినప్పటికీ.. అన్నదాతలు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపకుండా వరి సాగుచేస్తున్నారు. దీనికి తోడు జనవరి, ఫిబ్రవరి మాసంలో చేసే నువ్వు సాగుకు తప్ప.. మిగతా పంటలు వేసేందుకు సమయం పూర్తిగా దాటి పోయింది.
రైతన్నలేమంటున్నారంటే..?
భూగర్భ జలాలు పైనే ఉండటం.. తడి పొలాలు కావటంతో నువ్వు సాగు దిగుబడి రాదని రైతులు చెబుతున్నారు. అందుకే వరినే సాగుచేస్తున్నట్లు చెబుతున్నారు. మిగతా పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవటం.. కోతులు, అడవి పందుల బెడద తీవ్రంగా ఉండటం వంటి సమస్యలతో పాటు... నీళ్లు సమృద్ధిగా లభించడం వల్లనే వరిని వేస్తున్నామని రైతులు చెబుతున్నారు. జిల్లాలో గత వారం రోజులుగా నార్లు పోసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఈసారి వరినే వేస్తున్నామని... రైతుల పరిస్థితిని చూసి యాసంగి ధాన్యాన్ని కొనాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
' ఇక్కడ పెసలు, నువ్వులు పండవు. రైతులకు ఏ పంట వేయాలో తెలుసు. ఏఈవోలను వరి సాగుపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. యాసంగిలో 32 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. అదే వానాకాలంలో 22 క్వింటాళ్లే వస్తాయి. రైసు మిల్లర్లకు అమ్ముకున్నా.. వానాకాలంలో వచ్చిన డబ్బులే.. యాసంగిలోనూ వస్తాయి.'