Facilities in Varshakonda government school: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించడంతో పాటు వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు పాటుపడుతున్నారు. చదువుతో పాటు క్రీడలు, వైజ్ఞానికి ప్రదర్శనల్లో ముందుండేలా తీర్చిదిద్దుతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానంపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చూస్తున్నారు.
ఉత్తమ పాఠశాల
జడ్పీహెచ్ఎస్లో 145 మంది విద్యార్థులు చదువుతున్నారు. అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా క్రమశిక్షణను అలవరుస్తున్నారు. స్వచ్ఛత, పచ్చదనంపై ప్రత్యేకంగా దృష్టి సారించి మెుక్కలను పెంచుతున్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. బడి అంటే భయంతో కాకుండా ఆనందంగా అడుగుపెట్టేలా ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు.
'ఆరో తరగతిలో నాకు ఇక్కడ స్టడీ ఏం బాగా అనిపించలేదు. నేను ప్రైవేటుకు వెళ్లాలని అనుకున్నాను. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కంప్యూటర్ ల్యాబ్, గేమ్స్ వంటివి నిర్వహిస్తున్నారు. స్కూల్కు వస్తే ఇంటికి వెళ్లాలని అనిపించదు. అంతా బాగుంది స్టడీ.'
-విద్యార్థిని, వర్షకొండ పాఠశాల
'ఇక్కడ స్టడీ చాలా బాగుంది. హెచ్ఎం సార్ కూడా చాలా ప్రోత్సహిస్తారు. సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్, కంప్యూటర్ వంటివి చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ స్వచ్ఛ భారత్ కూడా నిర్వహిస్తాం. ఇంట్లో కన్నా స్కూల్లోనే బాగా అనిపిస్తుంది. టీచర్లందరితో ఫ్రెండ్లీగా ఉంటాం. టీచర్లు కూడా చాలా బాగా చెప్తారు. ప్రైవేటుకన్నా గవర్నమెంట్ స్కూల్ బెస్ట్. వర్షకొండ స్కూల్ ది బెస్ట్.'
-విద్యార్థిని, వర్షకొండ పాఠశాల