అధికార పార్టీకి చెందిన జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ భోగ శ్రావణి రాజీనామా నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎల్.రమణతో స్థానిక కౌన్సిలర్లు సమావేశమయ్యారు. జగిత్యాలలోని ఆయన నివాసంలో రమణతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. భోగ శ్రావణి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. పార్టీ ధిక్కరణ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రావణితో చర్చలు లేకుండా మరో ఛైర్పర్సన్ను ఎన్నుకోవాలని కౌన్సిలర్లు రమణ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై ఏం చేయాలనే విషయంపై కౌన్సిలర్లతో రమణ మాట్లాడారు. అయితే ఏ విషయమై అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు.
కన్నీటి పర్యంతమైన మున్సిపల్ ఛైర్‌పర్సన్..: జగిత్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ భోగ శ్రావణి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య నలుగుతున్న వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి శ్రావణి రాజీనామా చేసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులతోనే తాను రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
ఎమ్మెల్యే సంజయ్ మూర్ఖత్వాన్ని మూడేళ్ల పాటు భరించానని వాపోయిన ఆమె.. అందరి ముందు ఎమ్మెల్యే అవమానించేవారని ఆరోపించారు. పేరుకే మున్సిపల్ ఛైర్మన్.. పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని ఆమె విచారం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎమ్మెల్యే ఇవ్వలేదని.. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని.. కేటీఆర్ పేరు ఎత్తకూడదనే ఆంక్షలు జారీ చేసేవారని వాపోయారు. కలెక్టర్‌ను కలవవద్దని కూడా హుకూం జారీ చేసేవారని తెలిపారు. ఒక బీసీ బిడ్డగా తన ఎదుగదల చూడలేక సంజయ్‌కుమార్ తనపై కక్షగట్టారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.