జగిత్యాల పురపాలికలో తొలిసారి ఏర్పడిన తెరాస పాలకవర్గం ముంగిట పలు సమస్యలున్నాయి. దీర్ఘకాలిక సమస్యలే కాకుండా పాలనాపరమైన కొత్త చిక్కులు పాలకవర్గానికి సవాల్‌గా మారాయి. గత 3 నెలలు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ్యానికే ప్రాధాన్యమిచ్చినా పట్టణంలో ఆశించినంత మేర ప్రయోజనం కనిపించలేదు. మరోవైపు పలు విభాగాల్లో అధికారులు పదోన్నతులు, బదిలీలతో కిందిస్థాయి సిబ్బంది ఇన్‌ఛార్జులతో పాలన కొనసాగుతోంది. అభివృద్ధి పనుల్లోనూ వేగం తగ్గడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
'ఈ సమస్యలేంటి..? అభివృద్ధి పనుల లెక్కలు తేల్చండి' - jahgityala district news
జగిత్యాల జిల్లాకేంద్రం అభివృద్ధితో పాటు సమస్యలతోనూ సతమతమవుతోంది. పెరిగిన వార్డులు, జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమవుతున్న పాలకులు సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. పాలకవర్గం ఏర్పడిన ఆరు నెలల్లో అభివృద్ధి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
jahgityal
ప్రధానంగా కమిషనర్, శానిటరీ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలువురు సిబ్బంది సైతం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నందున పాలనాపరమైన సమస్యలు పెరిగాయి. ఇటీవల పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు బల్దియాలో వివాదానికి తావిచ్చాయి. అభివృద్ధి పనుల్లోనూ పారదర్శకత లోపించిందని సభ్యులు లెక్కలు చూపాలని కోరడం అధికారుల పనితీరును వెల్లడిస్తోంది.
పరిశీలించాల్సిన సమస్యలివీ...
- అన్ని వార్డుల్లోనూ చెత్త సేకరణ సవ్యంగా సాగడం లేదని పలు వార్డుల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
- పందులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని వీటి ద్వారా దుర్గంధం వ్యాపిస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- కాలనీలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
- శివారు కాలనీల్లో వీధిదీపాలు పూర్తిస్థాయిలో లేవని వెంటనే బిగించాలని స్థానికులు కోరుతున్నారు.
- ప్రధాన రహదారి వ్యాపారుల నుంచి చెత్త సేకరణ సజావుగా సాగడం లేదు. గతంలో మైకుల ద్వారా ఏర్పాటు చేసిన పద్ధతి నిలిపివేయడం వల్ల వ్యాపారులు అసహనానికి గురవుతున్నారు.
- పట్టణంలో ట్రాఫిక్ బాగా పెరిగింది. పోలీసుశాఖతో సమన్వయం చేసుకుని రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాల్సి ఉంది.
- మురుగుకాల్వలు కనీసం వారానికో సారైనా శుభ్రం చేయడం లేదని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు పెరిగాయి.
- దుర్గంధ ప్రాంతాల్లో బ్లీచింగ్‌లో నాణ్యత లేదని సున్నమే కనిపిస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!