Boga Shravani resigned from BRS party: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి తన కౌన్సిలర్ పదవీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామ చేశారు. గత కొంత కాలంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు, బోగ శ్రావణిల మధ్య విభేదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజాగా ఆమె రాజీనామా ఆ జిల్లాలో చర్చనీయాంశమైంది. తన లేఖను మంత్రి కేటీఆర్‌కు పంపుతున్నట్లు ఆమె తెలిపారు.
పట్టణంలో ఇంత జరుగుతున్న కనీసం పార్టీ నుంచి ఓదార్పు, సహకారం లేదని శ్రావణి వాపోయారు. ఆ కారణంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో కవిత అనుచరులను పార్టీకి దూరం చేయడమే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రావణి.. సంజయ్‌కుమార్ ఓటమికి మొదటి కారణం తానే అవుతానని జోస్యం చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రోత్సహంతోనే తాను బీఆర్ఎస్లోకి వచ్చానని తెలిపారు. ఇన్ని రోజులు తనను ఎంతగానో ప్రోత్సహించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతకొంత కాలంగా ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండగా.. తాజా పరిణామాలు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతునాయి. శ్రావణి మాత్రం "తనను అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయని.. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని" పేర్కొన్నారు.
ఇప్పటికే మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన శ్రావణి.. గతంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే మూర్ఖత్వాన్ని మూడేళ్లపాటు భరించానని మీడియా ఎదుట కన్నీంటి పర్యంతమయ్యారు. అందరి ముందు ఎమ్మెల్యే తనను అవమానించేవారని ఆరోపించారు. పేరుకే మున్సిపల్ ఛైర్మన్..పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని వాపోయారు. తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని.. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని.. కేటీఆర్ పేరు ఎత్తకూడదనే అనేవారని తీవ్ర ఆరోపణలు చేశారు.