Indians in foreign prisons : ఉపాధి కోసం ఊరొదిలిన అభాగ్యుల్లో చాలా మంది తెలిసో తెలియకో చేసిన తప్పులకు కటకటాల పాలవుతున్నారు. విదేశాల్లో జైళ్లలో మగ్గుతున్న వారి వివరాలు కావాలంటూ కొందరు ఎంపీల వినతి మేరకు పార్లమెంటులో విదేశాంగ శాఖ సహాయమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 82 దేశాల్లో 8,343 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధితులు కూడా పదుల సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఇవీ ఘటనలు
- కథలాపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి యూఏఈలో అక్రమంగా సరిహద్దు దాటుతూ పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
- సారంగాపూర్ మండలం లచ్చక్కపేటకు చెందిన ఇద్దరు అమాయకులను రాయికల్ మండలానికి చెందిన ఓ ఏజెంట్ మాయమాటలు చెప్పి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ విమానం ఎక్కించాడు. అక్కడి నుంచి మలేషియాకు భూమార్గం ద్వారా కొంత దూరం బస్సులో, కొంతదూరం నడక ద్వారా చేర్చారు. మలేషియాలో ఉపాధి కోసం బస్సు ఎక్కుతున్న అభాగ్యులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
- మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య రియాద్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
- మల్యాలకు చెందిన రాజయ్య జైల్లో శిక్ష అనుభవిస్తూ మృతిచెందగా కనీసం మృతదేహం ఇల్లు చేరలేదు. ఆయన డెత్ సర్టిఫికెట్ మాత్రమే పంపడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
నిబంధనలు తెలియక..ఉమ్మడి జిల్లా నుంచి 3.50 లక్షల మంది వరకు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. ఇందులో ఉద్యోగులుగా కొందరు స్థిరపడగా చాలా మంది కార్మికులుగా వివిధ దేశాల్లో పనులు చేస్తున్నారు. కార్మికులుగా స్థిరపడిన వారిలో కొందరికి శిక్షణ నైపుణ్యం ఉండగా ఎక్కువ మంది అన్స్కిల్డ్గానే పనులు చేసుకుంటున్నారు. ఏజెంట్ల వలలో పడిన వారు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతర్, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాల్లో అక్కడి నిబంధనలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలపై అవగాహన లేకపోవడంతో పాటు వీసా ముగిసినా అక్కడే ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు.