తెల్లారకుండానే కొవిడ్ పరీక్ష కేంద్రాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. కిట్ల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల వేకువ జామునే వచ్చి.. ఎండలోనే నిరీక్షిస్తూ పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షకోసం సుమారు 6 గంటలు పట్టడం వల్ల అప్పటి వరకు పొడెండలో నిలవలేక ఆధార్ కార్డులు, చెప్పులు, వాటర్ బాటిల్ ఇలా ఏదొకటి తమ తరఫున క్యూలో పెడుతున్నారు.
కిట్ల సంఖ్య పరిమితంగా... అనుమానితుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్రంలో కొవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ భారీగా ఉంటోంది. కొన్ని చోట్ల 50 మందికే పరీక్షలు చేస్తుంటే.. కొన్ని చోట్ల వంద నుంచి 150 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు పెరుగుతున్నందున తెల్లారకుండానే అనుమానితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఉదయం వచ్చిన వారికి టోకెన్లు పంపిణీ చేసి మధ్యాహ్నం పరీక్షలు చేస్తున్నారు. ఉదయం వచ్చి తిరిగి ఇంటికెళ్లలేక పరీక్ష చేసే వరకు ఎండలోనే వేచి చూస్తున్నారు. కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలు ఊరికి దూరంగా ఉండడం వల్ల దుకాణాలు అందుబాటులో ఉండడం లేదు. కనీసం తాగునీరు లేక అలమటిస్తున్నారు.