భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో... అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ మహిళకు ప్రవాస భారతీయ దంపతులు అండగా నిలిచారు. జగిత్యాలకు చెందిన ఓ ప్రవాస భారతీయ కుటుంబం వారి సొంతింటి కలను నెరవేర్చింది. ధర్మపురికి చెందిన బెళగం లావణ్య భర్త శివానంద్.. ప్రమాదవశాత్తు కొద్ది సంవత్సరాల క్రితం మరణించాడు. దీంతో లావణ్య ఇద్దరు చిన్న పిల్లలతో బంధువుల ఇంట్లో ఉంటోంది.
దాతృత్వం: పేద కుటుంబానికి ప్రవాస భారతీయుని సాయం - ఇల్లు కట్టించిన ప్రవాస భారతీయుడు
భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మహిళకు సాయమందించారు ఓ ప్రవాస భారతీయ కుటుంబం. సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకుని ఆమెకు ఇల్లును కట్టించారు. ఎన్ఆర్ఐ దంపతుల కుమార్తె జన్మదినం సందర్భంగా ఈరోజు గృహప్రవేశం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బెళగం లావణ్య వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపింది.

వారి కుటుంబ పరిస్థితిని ఫేస్బుక్ మిత్రుల పేజీ ద్వారా ప్రవాస దంపతులు తెలుసుకున్నారు. ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ప్రవాస భారతీయుడు ఎలుగందుల స్వరాజ్, అశ్విని దంపతులు ముందుకు వచ్చారు. తమ కుమార్తె శ్రీమయి జన్మదినం సందర్భంగా.. పేద కుటుంబానికి రూ.2 లక్షలతో గృహాన్ని నిర్మించి ఇచ్చారు. అలాగే పట్టణానికి చెందిన సంఘనబట్ల దినేష్ అనే స్థానికుడు.. లావణ్య ఇద్దరు పిల్లలను పదో తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు.