Hanuman Jayanti celebrations in Kondagattu : జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజును పురస్కరించుకొని ఏటా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇవాళ కార్యక్రమాల్లో భాగంగా.. స్వామి వారికి 108కిలోల పండ్లతో అభిషేకం, చమేలీ తైలంతో చందనాలంకరణ నిర్వహించారు. యాగశాలలో స్థపన తిరుమంజనం, లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించనున్నారు.
"ఇవాళ కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈరోజు స్వామి వారిని దర్శించుకున్నట్లయితే బుద్ధి, బలం, ఆరోగ్యం లభిస్తాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు".- జితేందర్, ఆలయ ప్రధానార్చకులు
హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న ఆలయం విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతోంది. మండలం రోజులు నిష్టతో ఆచరించిన వేలాది మంది మాలధారులు దీక్ష విరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరటంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల కోసం అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొండగట్టులో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.