Geeta Workers In Jagtial :జగిత్యాల గ్రామీణ మండలం అంతర్గాం గీత కార్మికులు గ్రామంలో పని లేక పొట్టకూటి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లేవారు. గీత కార్మికులకు వచ్చిన ఆలోచనతో సూక్ష్మ సేద్య పద్ధతిలో ఆరేళ్ల క్రితం 5 ఎకరాల్లో ఈత మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వ పథకం కింద తెచ్చుకున్న 5 వేల మొక్కలను తెచ్చి ఇక్కడ నాటారు. సాధారణంగా 10 సంవత్సరాలకు గాని గీతకు రాని చెట్లు.. డ్రిప్ పద్ధతిలో నీరు, ఎరువులు అందించడంతో నాలుగేళ్లకే గీతకు వచ్చాయి. దీంతో రెండేళ్లుగా కల్లు గీత గీస్తూ నీరా ఉత్పత్తి చేస్తున్నారు. గ్రామంలోనే కాకుండా సమీపంలోని జగిత్యాల పట్టణ పరిసరాల్లో నీరాను విక్రయిస్తున్నారు.
Neera Production In Jagtial : ఇక్కడ పని దొరక్క గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు సైతం స్వగ్రామానికి తిరిగొచ్చి ఇక్కడే ఇప్పుడు ఉపాధి పొందుతున్నారు. అయితే ఈత వనం సాగు కోసం స్థానిక నాయకుడు మాకునూరి జితేందర్ రావు బీజం పోయగా, స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకరించారని వారు చెప్పారు. మొత్తంగా గ్రామంలో 120 పైనే కుటుంబాలకు చెందినవారు రోజుకి 2 నుంచి 3 వేల వరకూ సంపాదిస్తున్నారు. గతంలో చేసేందుకు పనిదొరక్క ఇబ్బంది పడ్డ మాకు పనితో పాటు నాలుగు డబ్బులు వెనకేసుకోగలుగుతున్నామని గీత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.