'వేలాది ఎకరాలు మాయం' - harithaharam
అడవులు అనగానే విశాలమైన స్థలం... అందులో నీడనిచ్చే నిలువెత్తు వృక్షాలు గుర్తుకువస్తాయి. ఒకవైపు పచ్చదనం పెంచి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుంటే... మరోవైపు అడవుల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతుంది. భూములన్నీ అన్యాక్రాంతమై పోయాయి. అధికారుల కళ్లముందే వేలాది ఎకరాల అటవీ భూములు మాయమయ్యాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది.
!['వేలాది ఎకరాలు మాయం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2462001-470-402fef42-80ed-4b3c-a784-c44cf8a9eda4.jpg)
అంతరించిపోతున్న అడవులు
కొన్నేళ్లుగా ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న అడవుల నరికివేత వల్ల ఈ అటవీ ప్రాంతం.. కళ తప్పింది. రక్షణ చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఫలితమే ఈ మోడులు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో నర్సరీలు పెంచారు. వాటితో సహా అడవి రాత్రికి రాత్రే భారీ స్థాయిలో నరికి వేశారు. మరోవైపు అటవీభూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో సుమారు 4,120 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు అధికారులు లెక్కలు తీశారు. ఇలా కాజేసిన భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు కూడా తయారు చేయగా.. ఆ భూములు తాకట్టుపెట్టి రుణాలు పొందడం ఆశ్చర్యకర విషయం. ఆక్రమణలపై అనేక ఆరోపణలు, స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తినా... అధికారులు ఓ వీఆర్వోను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.
కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణపై దృష్టిసారించినందున అధికారులు అప్రమత్తమయ్యారు. సారంగపూర్ మండలంలో లక్ష్మీదేవి పల్లి వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకుంటేనే మళ్లీ పూర్వ వైభవం రానుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 16, 2019, 10:49 AM IST