తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదర్శం... భూమేశ్వర్ సాగు విధానం అనుసరణీయం - ఉత్తమ రైతు రాజారపు భూమేశ్వర్​

సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తూ ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే సూక్తిని ఆచరిస్తూ వ్యవసాయంలో ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంభించి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. సేంద్రీయ ఎరువులను తను పండించే పంటల్లో వినియోగించడంతో ఇప్పటివరకు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో ఉత్తమ రైతు అవార్డు పొందిన రాజారపు భూమేశ్వర్​ గురించి 'ఈటీవీ భారత్'​ ప్రత్యేక కథనం.

organic farming, jagtial, best farmer
సేంద్రీయ సాగు, జగిత్యాల, ఉత్తమ రైతు

By

Published : Jan 2, 2021, 2:26 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు రాజారపు భూమేశ్వర్ తన తండ్రితో కలిసి చిన్నతనంలో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. భూమేశ్వర్ గత ఎనిమిదేళ్ల నుంచి వినూత్న రీతిలో నూతన పద్ధతుల ద్వారా పంటలను పండిస్తూ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తనకున్న 8 ఎకరాల పొలంలో ఐదు ఎకరాల్లో వరి, మూడెకరాల్లో కూరగాయల సాగు చేస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలకు రసాయనాలు వాడని ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో పూర్తిస్థాయిలో సేంద్రియ పద్ధతి ద్వారా కూరగాయలు సాగు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. టమాట, వంకాయ, బీరకాయ, బెండకాయ, సొరకాయ, చిక్కుడుకాయ, కాకర, కొత్తిమీర, ఉల్లిపాయలు తదితర పంటలను సాగు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. భూమేశ్వర్​ పండించిన పంటలు కొనుగోలు చేసేవారు.

సేంద్రీయ విధానంలో కొత్తిమీర సాగు

రెండు మార్గాల్లో ఆదాయం

ఇదే కాకుండా తనకున్న సాగుభూమిలో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు భూమేశ్వర్​ నీటి కుంటలు ఏర్పాటు చేశారు. కుంట నీటి ద్వారా పంటలు పండిస్తూనే అందులోనే చేపలు పెంచుతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. మరో వైపు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేసుకుని అందులో కోళ్ల ఫారం ఏర్పాటు చేశారు. కోళ్లకు అందించే దానా ఖర్చు లేకుండా తాను పండించే కొత్తిమీర, పాలకూరను అందిస్తున్నారు. ఎనిమిది ఆవులను పెంచుతూ గో మూత్రం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పూర్తి సేంద్రియ విధానం ద్వారా కోళ్లను పెంచటంతో నాటు కోళ్లను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలివస్తున్నారు. తద్వారా రెండు చేతులా ఆదాయం గడిస్తున్నారు.

నీటి కుంటలో చేపల పెంపకం
దానా ఖర్చు లేకుండా నాటు కోళ్ల పెంపకం

గ్లూకోజ్​ బాటిళ్లలో బీర సాగు

భూమేశ్వర్​ గతంలో.. తాగే వాటర్ గ్లాసుల్లో పసుపు సాగు చేసి లాభాలు గడించి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. ఎండాకాలంలో పూర్తిగా నీటి ఎద్దడి ఉన్న సమయంలో తన పొలంలో స్థలం ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో బీర సాగు చేశారు. వాడి పడేసిన గ్లూకోజ్​ బాటిళ్లను సేకరించి గోరువెచ్చని నీళ్లు, సబ్బుతో పలుమార్లు.. 3 రోజులు వరుసగా శుభ్రం చేసేవారు. నాలుగవ రోజు బాటిళ్లలో మొక్కలు పెట్టి వాటి నిండా నీటిని పోసి ఆ నీటితో సాగు చేసేవారు. గ్లూకోజ్ బాటిళ్లతో బీర సాగు విషయం తెలుసుకుని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు.. భూమేశ్వర్​ను ప్రశంసించారు.

అధికారుల ప్రశంసలు

ఇలా సేంద్రీయ ఎరువుల ద్వారా వినూత్న పద్ధతిలో పంటలను సాగు చేయటంతో భూమేశ్వర్​ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ రైతు అవార్డు, ప్రత్యేక రాష్ట్రంలో ఉత్తమ రైతు అవార్డు పొంది ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రీయ పద్ధితిలో పంటలను పండించే విధానం తెలుసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి రైతులు వచ్చి అవగాహన పొందుతున్నారు.

ఇదీ చదవండి:'వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు'

ABOUT THE AUTHOR

...view details