తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతల ఇబ్బందులు

చేతిలో డబ్బులు లేక, పండిన పంటను ఎక్కడ, ఎలా అమ్ముకోవాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నకు 'పండిన ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది' అనే సర్కార్​ ప్రకటన కొండంత ఆనందాన్ని కలిగించింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అధికారుల అత్యాశ, నిర్లక్ష్యం కారణంగా అది కేవలం ప్రకటనగానే మిగిలిపోతోందనేది రైతన్నల వాదన. దళారులు, అధికారులు కుమ్మక్కై... అన్నదాతలను అందిన కాడికి దోచుకుంటున్నారు. లాక్​డౌన్​ కారణంగా సరిపడ హమాలీలు అందుబాటులో లేక రైతులపై అధికభారం పడుతోంది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం... తాలు, తప్ప పేరిట అధిక తరుగు... వెరసి అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు.

Farmer's troubles with the negligence of the authorities
అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతల ఇబ్బందులు

By

Published : May 6, 2020, 1:37 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పరిధిలోని మెట్​పల్లి, వేంపేట, రేగుంట, చౌలమద్ది, వెల్లుల్ల గ్రామాల్లో ఏప్రిల్​ 25వ తేదీన 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కొన్ని నిబంధనలు విధించి... వాటి ప్రకారమే కొనుగోలు చేస్తామని అధికారులు సూచించారు.

జగిత్యాల జిల్లా మెట్​పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేగుంట కొనుగోలు కేంద్రంలో అన్నదాతలు... పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ల కారణంగా కూలీలు, హమాలీలు అందుబాటులో లేరు. మరో పక్క అకాల వర్షాలు ఎప్పుడు ముంచుకొస్తాయో తెలియదు. ఈ సంకట పరిస్థితుల్లో చేతిలోని పంటను తొందరగా అమ్ముకొని, భారాన్ని దించుకోవాలి అనేది ప్రతి రైతన్న ఆలోచన.

ఇదే అదనుగా భావించి... అధికారులు, దళారులు కుమ్మక్కై, ధాన్యం క్రయవిక్రయాలను ఆలస్యం చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసే ధాన్యంలో తాలు, తప్ప పేరిట అదనంగా 2కిలోలు తూకం తీయండ కర్షకులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. గతంలో 40 కిలోలకు గాను ఒక కిలో అదనంగా తీసుకునేవారు కానీ ప్రస్తుతం 2 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. డబ్బులు మాత్రం 40 కిలోలకే చెల్లిస్తున్నారని తెలిపారు. దీంతో పాటు గతంలో క్వింటాకు రూ. 22 ఉన్న హమాలీ ధరను ప్రస్తుతం అమాంతం రూ. 32కు పెంచేశారు. హమాలీకి డబ్బులు చెల్లించి కూడా, ధాన్యాన్ని తామే సంచుల్లో ఎత్తాల్సి వస్తోందంటున్నారు కర్షకులు. తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి 20 రోజుల వరకు పంటను కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ధాన్యం ఆరబోత, రాత్రికి కుప్ప చేయడం... ఇదే వారికి రోజు వారి దినచర్యగా మారింది. అధికారుల నిర్లక్ష్య వైఖరితో కర్షకులు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ధాన్యాన్ని తొందరగా పాస్ చేసి, కొనుగోలు చేసేలా చూడాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇకనైనా తాలు, తప్ప పేరిట చేస్తోన్న అదనపు దోపిడిని అరికట్టి, తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి : భళా పోలీస్: ఓ వైపు కఠినత్వం.. మరోవైపు ఔదార్యం

For All Latest Updates

TAGGED:

raithulu

ABOUT THE AUTHOR

...view details