జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతల మధ్య సాగింది. మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చి కొనాలని.. సన్నరకం ధాన్యాన్ని క్వింటాకు రూ.2500 ప్రకటించాలని కోరుతూ రైతులు ధర్నాకు పిలుపునిచ్చారు. రైతుల నిరసనను భగ్నం చేసేందుకు భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. రైతులు ధర్నాకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రే సుమారు 200 మంది రైతు నాయకులను అరెస్ట్ చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా రైతన్నలు వెనక్కి తగ్గలేదు. పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
ముందుగా కొంత మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా రైతులు చేరుకున్నారు. కొద్ది సేపు.. రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు సహకరించారు పోలీసులు. రెండు గంటలైనా రైతులు ఆందోళన విరమించుకోకపోవడం వల్ల మరోసారి అరెస్టులకు తెరతీశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. కొందరు రైతులు.. పోలీసుల వాహనం అద్దాలు పగలగొట్టారు. టైర్లలో గాలి తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్పలాఠీ ఛార్జీ చేసి.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇలా కొద్దిసేపు ఉద్రిక్తత కొనసాగింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్ల నుంచి భారీ స్థాయిలో రైతులు తరలివచ్చారు.