జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లోని మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ప్రభుత్వ నిబంధనలతో అన్నదాతలు అత్యధికంగా సన్నరకం ధాన్యాన్ని సాగు చేశారు. సాగు చేసిన నాటి నుంచి నేటి వరకు కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు భారీ వర్షాలతో ఇబ్బందులు పడిన రైతులు... ఇంత జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పంట కోతకు రావడంతో.. ఇప్పటికి ప్రభుత్వం సన్నరకం ధాన్యం కొనేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో డివిజన్లో సుమారు పది నుంచి 15 వేల ఎకరాల్లో ధాన్యం సాగు చేస్తే.. ఈసారి ప్రభుత్వ ఆదేశాలతో సుమారు 45 వేల ఎకరాలకు పైనే అన్నదాతలు సాగుచేశారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు 2500 మద్దతు ధర అందించి ఆదుకోవాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.
సన్నరకం సాగుతో కర్షకులకు తప్పని కష్టాలు
సన్నరకం సాగు అన్నదాతలను అవస్థలకు గురిచేస్తోంది. నియంత్రిత విధానం వారికి ఆవేదనే మిగులుస్తోంది. సన్నాల సాగును మొదట ప్రోత్సహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మద్దతు ధర కల్పించటకపోవటం వల్ల అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి అప్పు చేసి మరీ సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తే చివరికి మిగిలింది ఏమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చాలా గ్రామాల్లో సన్నరకం వరి కిందపడిపోయి కర్షకులకు కష్టాలను తెచ్చిపెట్టింది. దీనికి తోడు ఉన్న పంటకు దోమపోటు సోకి చాలా నష్టం చేకూరుతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆవేదనకు గురైన రైతులు పలు గ్రామాల్లో వరికి నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి అప్పు చేసి మరీ సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తే చివరికి మిగిలింది ఏమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరితగతిన సన్నరకం వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రాన్ని దేశంలోనే తలమానికంగా నిలిపేలా కృషి చేస్తున్నాం'