Jagtial Master Plan Issue Updates : జగిత్యాల ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ చిచ్చు రేపుతోంది. 2041 వరకు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళికకు ముసాయిదా విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే రోడ్ల విస్తరణ, పారిశ్రామిక, వాణిజ్య, పబ్లిక్, సెమీ పబ్లిక్, పార్క్, ప్లేగ్రౌండ్స్ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084 హెక్టార్లుగా ప్రతిపాదించారు. 823 హెక్టార్లు పట్టణ ప్రాంతాన్ని, 216 హెక్టార్లు రహదారుల విస్తరణ, 209 హెక్టార్లు కొత్త రోడ్ల నిర్మాణం, 324 హెక్టార్లు ఉద్యాన, వినోద పార్కులు, 309 హెక్టార్లు వాణిజ్య జోన్, 2423 హెక్టార్లు నివాసిత ప్రాంతం, 238 హెక్టార్లు అటవీ ప్రాంతం, 546 హెక్టార్లు చెరువులు, 372 హెక్టార్లను గుట్టలుగా ప్రతిపాదించారు.
- కొత్త మాస్టర్ ప్లాన్ ఇలా..
ప్రాంతం(జోన్లు) | భూ విస్తీర్ణం (హెక్టార్లలో) |
పట్టణ ప్రాంతం | 823 |
రహదారుల విస్తరణ | 216 |
కొత్త రోడ్ల నిర్మాణం | 209 |
ఉద్యాన, వినోద పార్కులు | 324 |
వాణిజ్య జోన్ | 309 |
నివాసిత ప్రాంతం | 2423 |
అటవీ ప్రాంతం | 238 |
చెరువులు | 546 |
గుట్టలు | 372 |
ఇతరములు | మిగిలిన భూమి |
మెుత్తం | 6084 |
ఏ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు: మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో సమీప గ్రామాలను చేర్చడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నర్సింగాపూర్, కండ్లపల్లి, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హస్నాబాద్, లింగంపేట, మోతె వాసులు తమ భూములపై హక్కులు కోల్పోతామని వాపోతున్నారు. కనీస అవగాహన కల్పించకుండానే పంచాయతీల తీర్మానాలను బలవంతంగా తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.