Mango Crops Damaged: జగిత్యాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి భారీగా వీచిన ఈదురు గాలులతో పాటు అకాల వర్షం వల్ల చేతికొచ్చిన మామిడి కాయలు రాలి అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలోని మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి తదితర మండలాల్లో రైతులు ఈ గాలి దుమారాల వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగి రహదారులపై పడటంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ స్తంభాలను విరిగిన చోట గుర్తించి వెంటనే స్తంభాలను ఏర్పాటు చేసి సరఫరా చేశారు. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి.
చేతికి వచ్చిన పంట నేల పాలు..: ఈదురు గాలులు వేయడంతో మామిడి కాయలు పెద్ద ఎత్తున నేల రాలాయి. దాదాపు పంట అంత రాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అసలే మామిడి పంట సరిగా లేదని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న కాస్త పంటను కాపాడుకుంటున్న రైతులకు రాత్రి ఈదురు గాలులు, వర్షంతో పెద్ద ఎత్తున కాయలు నేల రాలడంతో రాలిన మామిడి కాయలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. అర్ధరాత్రి కురిసిన వర్షంతో పాటు ఈదురు గాలులకు మామిడి తోటల్లో ఎటు చూసినా రాలిన మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకొని రైతులను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే గ్రామాల్లో విక్రయం కోసం రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకు వచ్చిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది.