తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmer Protest: ఆగ్రహించిన అన్నదాత.. ధాన్యం బస్తాకు నిప్పంటించి ఆందోళన

Farmer Protest: వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. తరుగు పేరుతో రైతులను నిలువెత్తున మోసం చేస్తున్నారు. తాలు, తప్ప పేరుతో మిల్లర్లు భారీగా కోతలు విధిస్తున్నారని జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆగ్రహానికి గురై.. వడ్ల బస్తాకు నిప్పంటించి తన నిరసనను తెలియజేశాడు.

Farmer Protest: ఆగ్రహించిన అన్నదాత.. ధాన్యం బస్తాకు నిప్పంటించి ఆందోళన
Farmer Protest: ఆగ్రహించిన అన్నదాత.. ధాన్యం బస్తాకు నిప్పంటించి ఆందోళన

By

Published : Dec 19, 2021, 6:54 PM IST

Farmer Protest: ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులు మిల్లర్ల చేతిలో తరుగు పేరిట దోపిడీకి గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకుని ధాన్యాన్ని మిల్లుల వద్దకు తేగానే తాలు, తప్ప పేరుతో తూకంలో కోత వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్​ సాగు చేసిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. తరుగు పేరుతో రైతులను నిలువెత్తున మోసం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే కొనుగోలు ఆపేస్తామని బెదిరిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగ్రహంతో బస్తాకు నిప్పు

తాలు, తప్ప పేరుతో మిల్లర్లు భారీగా కోతలు విధిస్తున్నారని జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆగ్రహానికి గురై.. వడ్ల బస్తాకు నిప్పంటించి తన నిరసనను తెలియజేశాడు. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వంశీ రెడ్డి అనే రైతు కొన్ని రోజుల క్రితం ధాన్యాన్ని మల్లాపూర్ సహకార సంఘం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. ఒక్కో బస్తాను 40.650 కేజీల చొప్పున తూకం వేయించాడు. లారీలో లోడ్ చేసి గుండంపల్లి శివారులోని వర్షిని రైస్ మిల్లుకు తరలించాడు.

మిల్లర్​తో వాగ్వాదం

ధాన్యంలో తాలు, తప్ప ఉందంటూ 3కిలోలు అదనంగా కోతలు విధిస్తామని మిల్లర్ చెప్పాడు. ఆవేశానికి లోనైన రైతు వంశీరెడ్డి నిబంధనల ప్రకారమే కేంద్రంలో తూకం వేయించే ధాన్యం ఇక్కడికి తీసుకొచ్చామని.. మళ్లీ తాలు, తప్ప పేరుతో కోతలు ఏమిటని మిల్లర్​తో వాగ్వాదానికి దిగాడు. బస్తాకు రెండు కిలోల చొప్పున కోత విధిస్తేనే ధాన్యాన్ని అన్​లోడ్ చేసుకుంటామని.. లేదంటే లారీ వెనక్కి పంపుతానని మిల్లర్ చెప్పడంతో వంశీ రెడ్డి ధాన్యం బస్తాకు నిప్పంటించి ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవీందర్, ఎస్సై రాజేందర్​లు ఘటనాస్థలికి చేరుకొని ధాన్యం అన్​లోడ్ చేసేలా చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

paddy farmers problems: తరుగు పేరుతో మోసపోతున్న రైతులు.. పట్టించుకోని అధికారులు

ABOUT THE AUTHOR

...view details