కన్న బిడ్డలు ఇంట్లోకి రానివ్వకపోవడం వల్ల దిక్కులేక... ఐదురోజులుగా రోడ్డుపక్కనే వండుకొని తింటున్నారీ తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా తక్కల్లపల్లికి చెందిన గుర్రం బుచ్చిరెడ్డి-బుచ్చవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. తల్లిదండ్రుల అండతో మంచిగా స్థిరపడ్డారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. కానీ కన్న తల్లిదండ్రలను మాత్రం రోడ్డుపాలు చేశారు.
కొడుకుల మనసు కరగటం లేదు
ఇద్దరు కొడుకులు ఎవరికి వారు ఇళ్లు కట్టుకున్నారు. తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకునేందుకు ఇద్దరూ ఒప్పకోలేదు. కనీసం ఓ గూడైన ఏర్పాటు చేయాలని కోరినా...ససేమిరా అన్నారు. దీంతో ఆ వృద్ధులు రెండేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ మధ్య ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేయమనడంతో... వారికి రోడ్డు పక్కన చెట్టే దిక్కైంది. అక్కడే వంట చేసుకొని తిని, అక్కడే పడుకుంటున్నారు. దారివెంట వచ్చిపోయేవారైనా అయ్యే పాపం అంటున్నారు. కానీ... కొడుకులకు మాత్రం మనసు కరగటం లేదు. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధులు ఈటీవీ భారత్‌ను ఆశ్రయించారు. మాకు ఓ గూడు ఏర్పాటు చేస్తే చాలు అంటూ... ఈటీవీ భారత్ ప్రతినిధితో గోడు వెళ్లబోసుకున్నారు.
ఇదీ చూడండి:చిరకాల స్వప్నానికి తెర- 'కశ్మీర్'కు పండిత్‌లు!