EEtala rajender comments on KCR: రాష్ట్రంలో బీఆర్ఎస్కు ధీటైన పార్టీ బీజేపీనేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల ప్రజాగోస బీజేపీ భరోసా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించని ముఖ్యమంత్రి కేసీఆర్... దేశ వ్యాప్తంగా ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు.
ఒక చేతితో ఇచ్చి.. ఇంకో చేతితో తీసుకుంటున్నారు: జగిత్యాల జిల్లా మల్యాల ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ వంటి పార్టీలను ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనపరిచారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు ధీటైన పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతు బంధు పథకంతో రూ.5000 చెల్లించిన ప్రభుత్వం.. ధాన్యం కోత పేరుతో మరో చేతితో రూ.5000 వసూలు చేసుకున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయబోయేది బీజేపీనని స్పష్టం చేశారు.
మాజీ పురపాలక ఛైర్ పర్సన్‌తో ఈటల భేటీ: జగిత్యాలలో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ పురపాలక ఛైర్ పర్సన్ శ్రావణితో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. గురువారం పార్టీకి రాజీనామా చేయగా.. ఆమెను కలసి బీజేపీలో చేరే విషయంపై చర్చించారు. ఆమెను బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఆహ్వానించామని తెలిపారు.