Jagtial Rains News:అక్కడ రోడ్లపై నడవాలంటే నరకమే. అడుగు అడుగుకో గుంత.. ఎక్కడ జారి పడతామోననే భయం. మిషన్ భగీరథ పైపుల కోసం రోడ్డును తవ్వి వదిలేశారు. మూడున్నర సంవత్సరాల నుంచి నాయకులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే చాలు.. తమ కష్టాలు రెట్టింపు అవుతున్నాయని వాపోతున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. మూడున్నర ఏళ్ల నుంచి మిషన్ భగీరథ పనులు నడుస్తుండటంతో పైపులైన్ల కోసం రోడ్లన్నీ తవ్వి అలాగే వదిలేశారు. పట్టణంలో ఏ రోడ్డు చూసినా గుంతలతో దర్శనమిస్తోంది. ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతలలో నీరు నిండి ప్రమాదకరంగా తయారయ్యాయి. చిన్నారులు, వృద్ధులు.. బురద రోడ్లపై జారిపడి గాయాల పాలవుతున్నారు. ఏటా అభివృద్ధి పేరిట రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రోడ్లు మాత్రం బాగు చేయట్లేదంటూ పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"అభివృద్ధి పనుల కోసం రోడ్లను తవ్విన మాట వాస్తవమే. గత మూడు సంవత్సరాలుగా మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. కొన్ని రోడ్లకు స్వల్పంగా మరమ్మతులు నిర్వహించాం. మరికొన్ని అలానే ఉంచవలసి వచ్చింది. అందువల్ల భారీ వర్షాల ధాటికి ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రమాద స్థాయిని బట్టి అక్కడక్కడ తాత్కాలిక చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం."- జగదీశ్వర్ గౌడ్, పురపాలక కమిషనర్