తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండగట్టు అంజన్న ఉత్సవాలకు కరోనా ముప్పు

కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాలకు కరోనా ముప్పు పొంచి ఉంది. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా గతేడాది ఉత్సవాలను అధికారులు రద్దు చేశారు. ఈ ఏడాది కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం సభలు, సమావేశాలు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించింది. ఏప్రిల్‌ 27న నిర్వహించాల్సిన హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాల నిర్వహణపై ఆలయ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.

kondagattu Anjanna,  kondagattu Anjanna festivities
కొండగట్టు అంజన్న

By

Published : Apr 2, 2021, 7:00 AM IST

ఇప్పటికే కరోనా సెకండ్‌వేవ్‌ విస్తరిస్తుండడంతో దీక్షాపరుల మాల విరమణ కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతుందని కొందరు అర్చకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్‌ భక్తులు 40 రోజులు మండల దీక్షలో ఉండి జయంతి రోజు అర్ధరాత్రి తర్వాత స్వామివారిని దర్శించుకోవాలని ఉత్సాహంతో వస్తారు. మాల విరమణకు ఒక్కో బ్యాచ్‌లో దాదాపు 500 నుంచి 1000 మంది దీక్షాపరులు ఉంటారు. దీంతో ఆలయంలో పనిచేసే సిబ్బందికి, భక్తుల్లో ఏ ఒక్కరికైనా కరోనా ఉంటే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. కొండగట్టు ఆలయంలో ప్రసాదం తయారు చేసే భవనంలో విధులు నిర్వర్తించే ఉద్యోగికి నాలుగురోజుల క్రితం కరోనా సోకినట్లు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో అక్కడ పనిచేసే కూలీలకు కూడా వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందని భక్తులు సూచిస్తున్నారు.

కలెక్టరు ఆదేశాల ప్రకారం

హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టరు ఆదేశాలను పాటిస్తాం. ఈ విషయమై రెండు రోజుల్లో కలెక్టరుతో సమావేశమై కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తారో దాని ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తాం. ప్రసాదం తయారీ కేంద్రంలో ఉద్యోగికి కరోనా సోకిన విషయమై తగు జాగ్రత్తలు తీసుకుంటాం. అంజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించి దూరంగా ఉండేలా చర్యలు తీసుకొంటాం. - చంద్రశేఖర్‌, ఈవో కొండగట్టు అంజన్న ఆలయం

ఇదీ చూడండి: బ్యాంకులో చోరీకి గురైన సొమ్ము విలువ రూ.3.10 కోట్లు: సీపీ

ABOUT THE AUTHOR

...view details