తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2020, 9:26 AM IST

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభణ

కరోనా మహమ్మారి జగిత్యాల జిల్లాలో పంజా విసురుతోంది. జగిత్యాల జిల్లాలో రోజురోజుకూ పాజిటివ్​ కేసులు నమోదవుతుండటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మెట్​పల్లి పట్టణంలోనూ కొవిడ్​ బాధితులు పెరిగిపోతున్నారు.

corona cases increasing in jagityala district
corona cases increasing in jagityala district

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతోంది. తాజాగా పట్టణానికి చెందిన ఓ టిఫిన్‌ సెంటర్‌ యజమాని(57) కరోనాతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సామాజిక ఆసుపత్రిలో 27 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్​గా‌ నిర్ధరణ అయింది. ఇందులో ఓ గర్భిణికి కూడా ఉన్నారు. అర్బన్‌ పీహెచ్‌సీలో నలుగురు వ్యక్తులకు పరీక్షలు జరపగా అందరికీ నెగెటివ్‌ ఫలితం వచ్చిందని వైద్యులు తెలిపారు.

జగిత్యాల ధరూర్‌క్యాంపు: పొలాసలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో పరిశోధనస్థానంలో శానిటైజేషన్‌ చేయించి శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు ప్రకటించారు.

మెట్‌పల్లి పట్టణం :రెడ్డి కాలని, చైతన్యనగర్‌, రాంనగర్‌, కూరగాయల మార్కెట్‌ ఏరియాలలో పుర అధికారులు హైపో క్లోరైడ్‌ ద్రవణాన్ని పిచికారి చేయించి ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.

కోరుట్ల గ్రామీణం : అయిలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 9 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. వీరిలో ఒకరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కాగా, మరొకరు కోరుట్ల మున్సిపల్‌ పరిధిలోని ఓ శివారు కాలనీకి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.

రాయికల్‌ పట్టణం:‌ పట్టణంలోని సామాజిక ఆసుపత్రిలో మంగళవారం 13 మందికి కరోనా రాపిడ్‌ కిట్‌ పరీక్షలు చేయగా ఓ యువకునికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యిందని వైద్యాధికారి కృష్ణ ఛైతన్య తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్న యువకుడి సహోద్యోగులకు కరోనా రావడం వల్ల అనుమానంతో రాపిడ్‌ కిట్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నమోదయ్యింది.

మల్యాల: ముత్యంపేటలో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ సోకినట్లు వైద్యాధికారి డాక్టర్‌ లావణ్య తెలిపారు. మంగళవారం మండలంలోని 17మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా వారిలో ముత్యంపేటకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి సోకినట్లు వైద్యాధికారి వివరించారు.

పెగడపల్లి: పెగడపల్లి మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి డా.సుధాకర్‌ తెలిపారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన రాపిడ్‌ వైద్య పరీక్షల్లో బతికపల్లికి చెందిన ఒక మహిళకు, రాంభద్రునిపల్లిలో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకినట్లు తేలింది. దీంతో వీరిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సారంగాపూర్‌: సారంగాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మండలంలోని పలు కార్యాలయాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని సారంగాపూర్‌లోని సాంఘీక సంక్షేమ వసతి గృహంలో హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరికి అన్ని వసతులను సారంగాపూర్‌ సర్పంచి గుర్రాల రాజేందర్‌రెడ్డి కల్పించారు. ఆరోగ్య సిబ్బంది మందులు అందించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి భాజపా నాయకులు నిత్యావసర సరకులు అందించారు.

ఇబ్రహీంపట్నం: ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సహకరించాలని సర్పంచి నేమూరి లత పేర్కొన్నారు. వార్డుల్లో పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్‌, రసాయనాలను పిచికారీ చేశారు. గ్రామంలో ఇటీవల కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు మరో ముగ్గురికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు చేయగా అతడి భార్యకు మాత్రమే పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి వనజ తెలిపారు. గ్రామంలో రెండు కేసులు నమోదవడంతో ఉదయం 6 నుంచి 11 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచి, తర్వాత బంద్‌ పాటించాలని సర్పంచి లత కోరారు.

ABOUT THE AUTHOR

...view details