తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2020, 2:00 PM IST

ETV Bharat / state

పల్లెల్లో కరోనా కలవరం.. పట్నంలో ప్రాణభయం

జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం మరో 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా అందులో ఓ జిల్లాస్థాయి అధికారి, ఎస్సై దంపతులు, ఓ మహిళా కానిస్టేబుల్‌, ఏఎన్‌ఎం, ఓ వైద్యాధికారి డ్రైవర్‌ ఉన్నారు.

corona cases are increasing gradually in jagtial district
జగిత్యాల జిల్లాలో కరోనా కలవరం

జగిత్యాల జిల్లాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 25 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. 25 కేసుల్లో జగిత్యాలలో 16.. హన్మాజీపేటలో 5, ధర్మపురి మండలం నేరెళ్ల, జైన, రాయికల్‌ మండలం వీరాపూర్‌, మల్యాల మండలం నూకపల్లిలో ఒక్కో పాజిటివ్‌ కేసు ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 280కి చేరింది. శనివారం పరీక్షలకు పంపిన 44 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

అధికారుల వణుకు

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ అధికారుల్లో వణుకు మొదలైంది. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే జిల్లాస్థాయి కీలక అధికారి కుటుంబం హోం ఐసోలేషన్‌లో ఉండగా మరో జిల్లాస్థాయి అధికారి, ఓ పోలీసు సబ్‌ డివిజన్‌ అధికారి, ఇద్దరు ఎస్సైల దంపతులు సహా దాదాపు 20 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స పొందుతున్నారు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య పరీక్షల కోసం వరస కడుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న వారంతా భయాందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల కోసం వచ్చే వారిని లోపలికి అనుమతించక పోయినప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో భయం.. భయంతో విధులు నిర్వహిస్తున్నారు.

పల్లెల్లో కలవరం

ధర్మపురి గ్రామీణం :

పల్లెల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా నేరెళ్లతో పాటు మరో గ్రామంలో కరోనా కేసు నిర్ధరణ కావడంతో ఆయా గ్రామాలు నివారణ చర్యలు చేపట్టాయి. గ్రామాల్లో మాస్కు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తున్నారు. వీధుల్లో హైడ్రోక్లోరిన్‌ పిచికారి చేస్తున్నారు.

పెగడపల్లిలో ఇద్దరికి పాజిటివ్‌

పెగడపల్లి:

పెగడపల్లి మండల కేంద్రంలోని ఒక యువకుడు, మరో పోలీసు ఉద్యోగికి శనివారం రాత్రి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ కావడంతో గ్రామంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది ఆదివారం రసాయనాలు పిచికారి చేశారు. మండలంలో కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. వీరందరిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారి సుధాకర్‌ తెలిపారు.

రాయికల్‌లో మహిళకు..

రాయికల్‌

మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాయికల్‌ ఆరోగ్య కేంద్రం వైద్యుడు కృష్ణచైతన్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details