రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలంటూ జగిత్యాలలో భారీ ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. కనీస మద్దతు ధర ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను ముంచేందుకే కొత్త చట్టాలు: జీవన్‌రెడ్డి - కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
దిల్లీకి వెళ్లిన కేసీఆర్.. మోదీకి పొర్లు దండాలు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని భారీ ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చౌరస్తాలో రైతులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లను కొనసాగించకపోతే రైతులే తెరాస నాయకులను అడ్డుకుంటారని హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చారని భాజపా ప్రభుత్వాన్ని విమర్శించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటయ్యారని.. అందుకే దిల్లీకి పోయి పొర్లు దండాలు పెట్టారని ఎద్దేవా చేశారు. పసుపు పంటకు క్వింటాలు ధర రూ.15 వేల చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అక్రమ సంపాదన కాపాడుకోవటానికే కేంద్రానికి రైతులను తాకట్టు పెట్టారని జీవన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.