నూతన వ్యవసాలయ చట్టాల అమలు విషయంలో కేసీఆర్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మొదట చట్టాలను వ్యతిరేకించిన సీఎం ఇప్పుడు ముందుగానే రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. దిల్లీలో జరిగిన పరిణామాలపై జగిత్యాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
'కేసీఆర్.. సాగుచట్టాలపై ఎందుకు వెనక్కితగ్గారో చెప్పాలి' - దిల్లీలో రైతుల ఘర్షణకు మోదీ ఆలోచించాలన్న జీవన్‌రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ ముందుగానే వాటిని అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతోందని ఆయన ఆరోపించారు. దిల్లీలో జరిగిన పరిణామాలపై జగిత్యాలలో ఆయన మాట్లాడారు.
దిల్లీలో జరిగిన పరిణామాలతో మోదీ ఇప్పటికైనా పునరాలోచించాలన్నారు. రెండు నెలల నుంచి చేస్తున్న ఆందోళనలతో నిరాశ నిస్పృహలకు లోను కావడం ఘర్షణకు దారి తీసిందన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై మీకు విశ్వాసం ఉంటే ఎన్నికలకు వెళితే ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మోదీ, కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
వచ్చే సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే దిల్లీ తరహాలో రాష్ట్రంలో రైతుల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంకు మిల్లర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు.