CM KCR Kondagattu Tour: దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్ రానున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించక ముందు 1998లో ఆలయానికి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దే క్రతువులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు ప్రకటించారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
సుమారు రెండు గంటల పాటు కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్న సీఎం.. ఆలయ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
కొండగట్టులో సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ యాస్మిన్ బాషా పరిశీలించారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ రానున్న దృష్ట్యా (మంగళవారం) నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు.