CM KCR Visit to Kondagattu: ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు చేరుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి అంజన్న క్షేత్రానికి వచ్చిన సీఎంకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా కొండగట్టుకు చేరుకున్న సీఎం.. ముందుగా విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం బస్సులో కొండగట్టు గుట్టపైకి చేరుకున్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దే క్రతువులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల నిధులను ప్రకటించగా.. చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరపనున్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేశారు.
భక్తుల హర్షం..: ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రాక పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నామని, నిధుల కేటాయింపుతోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టులో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఘాట్ రోడ్ల అభివృద్ధి, ఆలయ ఆవరణలో గ్రీనరీ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, నూతన కాటేజీల నిర్మాణం.. నడకదారి అభివృద్ధి లాంటి పనులు చేయాలన్న డిమాండ్ ఉంది. తాగు నీటితో పాటు కోనేరులో నీటి కోసం ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. కొత్తగా క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు మహిళలు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.