పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వారికి తెలిస్తే వారి భవిష్యత్తు నిర్మించుకోడానికి ఆ పరిస్థితులు ఎంతో దోహదపడతాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సత్తెక్కపల్లి కూరగాయల సాగుకు పెట్టింది పేరు. గ్రామస్థులంతా తెల్లారి లేస్తే పొలంబాటే పడతారు. లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం వల్ల పిల్లలు కూడా సాగులో సాయం చేస్తూ తమ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకుంటున్నారు.
ఇంచుమించు గ్రామంలోని పిల్లలంతా తెల్లారి మొదలు సాయంత్రం వరకు సాగులోనే నిమగ్నమవుతున్నారు. కూరగాయలు కోస్తూనో... కలుపు ఏరివేస్తూనో కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకుంటూ ఆడుతు పాడుతూ పనులు చేసుకుంటున్నారు. గతంలో తమ పాఠశాలలో జరిగిన సంఘటనలు... తమ స్నేహితుల గురించి.. పాఠాల సంగతులు తల్లిదండ్రులకు చెపుతూ ఆనందంగా గడుపుతున్నారు.