జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకొంది. ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వస్తున్న వేళ పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల కౌన్సిలర్ రజిని భర్త బండారి నరేందర్ నృత్యం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలారు. అక్కడే ఉన్న కార్యకర్తలు సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ నరేందర్ ప్రాణాలు విడిచారు.
ఈ ఆత్మీయ సమ్మేళానికి ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉండగా.. ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నరేందర్ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. దీంతో పార్టీ ఆత్మీయ సమ్మేళనం రద్దు చేశారు. నరేందర్ పార్థివదేహానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను కవిత ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో 13 సంవత్సరాల బాలిక గుండెపోటుతో కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మరిపెడ మండలం బోడతండాకు చెందిన బోడ లక్‌పతి, వసంత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కూతురు స్రవంతి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరోతరగతి చదువుతోంది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు ఇచ్చారు.
దీంతో తోటి పిల్లలతో స్రవంతి సాయంత్రం వరకు తండాలో ఆడుకుంది. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి రాత్రి నానమ్మ వద్ద నిద్రించింది. శుక్రవారం తెల్లవారు జామున ఛాతిలో ఏదో ఇబ్బందిగా ఉందంటూ ఆ బాలిక నానమ్మను లేపింది. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. ఏం జరిగిందో అర్థం కాని ఆమె.. వెంటనే కుటుంబసభ్యులకు విషయం చెప్పింది.