మనువాడబోయే వాడిపై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ పెళ్లి బరాత్‌లో ‘బుల్లెట్ బండి...’ పాటకు ఓ నవ వధువు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తప్పా.. వచ్చేత్తప్పా గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ ‘బుల్లెట్ బండి...’ పాటకు నవ వధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్ ఎండీగా పని చేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్ అధికారి పి.నరహరి ట్వీట్ చేశారు. గాయని మోహన భోగరాజును ఆయన ట్యాగ్ చేయగా.. ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణంగా.. మెట్టినింటికి వెళ్లేటప్పుడు వధువు కన్నవారిని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. కానీ ఈ వధువు మాత్రం కాస్త డిఫరెంట్. కట్టుకున్న భర్తతో జీవితాంతం సంతోషంగా ఉంటాననే ఆనందంతో అదిరిపోయే స్టెప్పులేసింది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రియ తన పెళ్లి బరాత్‌లో వరుడి కోసం డ్యాన్స్ చేసి కొత్త ట్రెండ్ సృష్టించింది. ' నీబుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా వచ్చేత్తప్పా ..పాటకు స్టెప్పులేసి తన జీవితంలోకి భర్తను మనసారా ఆహ్వానించింది. పాటలోని పదాలకు అనుగుణంగా చిందేసి పెళ్లికుమారుడిని ఫిదా చేసింది. 'పట్టుచీరనే గట్టుకున్నా.. గట్టుకున్నుల్లో గట్టుకున్నా'అంటూ తన సింగారాన్ని ఒలకపోసింది. 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. వచ్చేత్తప్పా' అంటూ చేతిని తన భర్తకందించింది. 'నువ్వు నన్నేలుకున్నావురో దండ మెల్లోన ఏస్తానురో.. నేను నీ యేలు పట్టుకోని మల్లె జల్లోన ఎడతానురో' అంటూ తన ఆనందం వ్యక్తపరిచింది. 'మంచి మర్యాదలు తెలిసినదాన్ని... మట్టి మనుషుల్లోనా పెరిగినదాన్ని' అంటూ తన కల్మషం లేని మనసును ఆవిష్కరించింది. సాయిశ్రియ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పెళ్లి కూతురు భలేగా డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ నూతన దంపతులు ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలని విష్ చేస్తున్నారు.
ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రియకు రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. పెళ్లి బరాత్‌లో వధువు చేసిన డ్యాన్స్ వీడియో నాలుగు రోజులగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోను షేర్ చేసి వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. తన పాటకు ఈ వీడియోతో మరింత పాపులారిటీ వచ్చిందని గాయని మోహన భోగరాజు ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
కొత్త పెళ్లికూతురు స్టెప్పులకు అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు. కేరింతలు కొడుతూ చప్పట్లతో మరింత ఉత్సాహాన్నిచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అదే స్పందన వస్తోంది.