Kondagattu anjanna jayanti : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపట్నుంచి ఈ నెల 14 వరకు జరిగే ఉత్సవాలకు పెద్ద ఎత్తున హనుమాన్ మాలధారులు తరలిరానున్నారు. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు వారి మాలలను స్వామి సన్నిధిలో విడుస్తారు. అయితే ఉత్సవాలు సమీపించినా ఏర్పాట్లు పూర్తి కాకపోవటం భక్తులను కలవరపరుస్తోంది.
kondagattu anjanna jayanti Utsavalu : ఆంజనేయ స్వామి స్వయంగా వెలసిన క్షేత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కొండగట్టు ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇటీవలే ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంజనేయుడు పుట్టిన వైశాఖ మాసంలో జరిగే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే ఉత్సవాల్లో దాదాపు మూడు లక్షల మంది మాలధారులు దీక్ష విరమణ చేయనున్నారు. స్వామివారికి అభిషేకం, సహస్ర నామార్చనతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా లోకకల్యాణార్థం రోజు హోమం జరుపనున్నారు. స్వామికి సమర్పించే పట్టువస్త్రాలను నేతన్నలతో ఆలయంలోనే నేయిస్తున్నారు. మరోవైపు భక్తుల కోసం ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది.