Bandi Sanjay on Delhi Liquor Scam: దిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే.. చేసిన పాపాలు పోతాయా కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత కమిషన్ దొబ్బి.. దిల్లీ పోయావో ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీ మద్యం కేసుపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా జాతీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈనెల 15న మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్‌లో జరగనుందని బండి సంజయ్ తెలిపారు. ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరవుతారన్నారు. జనసమీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరీంనగర్ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి, కేసీఆర్‌కు ఛాలెంజ్ విసురుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చలిగల్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.