Girl Dancing with Artificial Legs in Jagtial : సుధా చంద్రన్.. కాలు కోల్పోయినా పట్టుదలతో తన నృత్యంతో అందరినీ ఆశ్చర్యపర్చడమే కాకుండా.. ఎంతో మంది మదిలో స్ఫూర్తిని రగిల్చింది. అదే మాదిరి చిన్న వయసులో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.. జగిత్యాల జిల్లాకు చెందిన ఈ బాలిక. ఆ జూనియర్ సుధా చంద్రన్ కథేంటో మీరూ చూడండి.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన అంజన శ్రీ.. నాలుగేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటుండగా స్కూల్ బస్సు వచ్చి ఢీకొట్టడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. చిన్నారిని చూసి తల్లిదండ్రులు కుంగిపోయారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి కృత్రిమ కాలు అమర్చారు.
రెండోసారీ ప్రమాదం..: కానీ అంజన శ్రీ మాత్రం ఆ బాధ నుంచే గుండె ధైర్యాన్ని కూడగట్టుకుంది. డ్యాన్స్ నేర్చుకోవాలన్న తన కోరికను తల్లిదండ్రులకు చెప్పి కృత్రిమ కాలుతో ప్రయత్నాలు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న ఓ మాస్టర్ దగ్గర కూచిపూడి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. అంతా బాగుంది అనుకున్న సమయానికి.. కారు ప్రమాదంలో మరో కాలికి తీవ్ర గాయాలు కావడంతో.. శస్త్ర చికిత్స చేసి కాలు లోపల రాడ్లు వేశారు.
ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన..:ఒకటేమో కృత్రిమ కాలు, మరో కాలికి తీవ్ర గాయాలు.. ఇలా ఉన్నా కూచిపూడిని ఇష్టంగా నేర్చుకుంది. గత కొన్ని రోజులుగా స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శన చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది అంజన శ్రీ. ఇటీవల హైదరాబాద్లోని త్యాగరాజ కళాభవన్లోనూ నాట్య ప్రదర్శన చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.