Amavasya Effect on Schools: 24 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చారు. కానీ విద్యార్థులు మాత్రం హాజరుకాలేదు. ఎందుకురాలేదో తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించారు. వారు చెప్పిన సమాధానాలు విని షాక్కు గురయ్యారు. ఈ రోజు అమావాస్య అని.. అందుకే స్కూలుకు పంపలేదని కొందరు చెప్తే.. కరోనా ప్రభావం తగ్గాక పంపిస్తామని మరికొందరు బదులిచ్చారు.
కొత్త బస్టాండ్ సమీపంలోని ఉన్నత పాఠశాలలో 112 మంది విద్యార్థులకు కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. చావిడి ప్రాంతంలోని నూతన ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు గాను కేవలం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. బాలికల ఉన్నత పాఠశాలలో 336 మందికి 31 మంది విద్యార్థులే స్కూలుకు వచ్చారు. బంటుపేట బాలుర ఉన్నత పాఠశాలలో 300 పైచిలుకు విద్యార్థులుండగా.. కేవలం 21 మంది మాత్రమే స్కూల్ కి వచ్చారు. శివాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో 182 మంది విద్యార్థులకు గాను.. తొమ్మిది మంది విద్యార్థులే హాజరయ్యారు. ఏ తరగతిగది చూసిన విద్యార్థులు లేక ఖాళీ బల్లలు దర్శనమిచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించినా... అమావాస్య మాత్రం అడ్డుతగిలింది.